Saturday, December 24, 2022

Corporate world


 Corporate world ... ఈ పేరు వినగానే గ్రామీణ, అర్బన్ ప్రాంత యువతకు చాలా పెద్ద పదంగా కనపడుతూ ఉంటుంది. English లో మాట్లాడే జనాలు, మెయిల్స్ గోల, colourful జీవితాలు, అర్థం కానీ యవ్వారాలు అనుకుంటూ ఉంటారు. ఆ చాలా మందిలో నేనూ కూడా ఒకడినే. భాష రాకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులతో మనలో మనం ఆత్మనూన్యతకు గురవుతూ ఉంటాం. ఇప్పటికీ నాకు ఇంగ్లిష్ అంటే మాట్లాడటానికి ఇబ్బందిపడే అంశమే.


అయితే, ఇక్కడితోనే మన భవిష్యత్తు ఆగిపోతుందని అనుకోవద్దు. మీలో నిజంగా ఎదగాలనే తపన, క్రమశిక్షణ, మంచి బుద్ధి, నలుగురిలో కలిసిపోయే తత్వం, సానుకూల దృక్పథంతో ఉంటే ఎదగగలం. అయితే అడుగులు తడబడొచ్చు, మెల్లగా వేయొచ్చు, మందకొడిగా సాగొచ్చు. అంతమాత్రం చేత మనలో ఎదుగుదల ఆగిపోయింది అనుకోవద్దు. అసలు భయపడొద్దు. మీకు వచ్చినదానితో మీరు ఎంత వరకు ప్రతిభావంతంగా పని చేయగలరో ఆలోచించండి. దానికి పదును పెట్టండి. భాష నేర్చుకోవడానికి ప్రయత్నించండి. రాకపోయినా కంగారుపడొద్దు. ఆలస్యం అయినా గమ్యాన్ని చేరుకోవచ్చు. గగనంతో పోటీ పడేలా దూసుకుపోవచ్చు.

చెబుతున్నా కదా... డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం మనం. నాలా తెలుగులో మాత్రమే రాయగలిగే వాళ్లు చాలా మందికి అదే గొప్ప అవకాశం. ఆలోచించండి. సోషల్ మీడియాలో, మీరు చూస్తున్న ఓటీటీ ప్రపంచంలో మన మాతృభాషకు పెరుగుతున్న అవకాశాలు. స్థానికతకు పట్టం కడుతోంది ప్రపంచం.

16 కోట్ల మంది తెలుగువారు ఉన్నారని అంటుంటారు. పది కోట్ల మంది ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. మిగిలిన ప్రపంచంలో మిగిలిన వాళ్లు. తరాలు మారుతున్నా తెగిపోనిది ఏదైనా ఉందంటే మట్టితో మనకున్న మమకారమే. ఒక్కసారి గుండె లోతుల్లో ఉన్న ఆ తడిని తాకి చూడండి. మిమ్మల్ని ఎవరు దూరం పెడతారు? స్వార్థంతో కాదు. నిస్వార్థమైన, నిష్కల్మషమైన ఆలోచనతో మీరు నడవడం మొదలుపెట్టండి. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినవారు అవుతారు. నాకు వచ్చిన భాషలో మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించాను. ఇది మన భాష.. మన తెలుగు. మన ఊరి మాట. మన అమ్మ చూపిన బాట.

మిమ్మల్ని, నన్ను నడిపించేది ఆ తెలుగు బంధమే. కార్పొరేట్ దిగ్గజాలు కూడా వాళ్ల మాతృభాషలోనే ఆలోచిస్తారు. ఇంగ్లిష్‌లో ఆచరణలో పెడతారేమో అంతే. ఇక్కడ ఎవరి అవకాశాలను ఎవరూ గద్దల్లా తన్నుకుపోలేరు. మీకు ఆలోచన, వినూత్నమైన దృక్పథం ఉంటే మీకు ప్రపంచమే ఆహ్వానం పలుకుతుంది. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన అమ్మ భాష సాక్షిగా చెబుతున్న మాటలివి. గెలిచేంత వరకు కాదు, మరో నలుగురికి దారి చూపే వరకు ఈ పయనం సాగుతుంది.

Thursday, December 22, 2022

రాళ్లబండి

 అర్ధరాత్రి అయినా, ఇంకా మెలకువగా ఉండటానికి కారణం స్వర్గీయ శ్రీ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు. అవధానంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉంది. భాషాభిమాని, మంచి వక్త, కవి, రచయిత. ఆఫీసు వాళ్లతో క్రికెట్ ఆడి ఇంటికి వస్తున్న సమయంలో ఎందుకో ఆయన నా మనసుకు స్ఫురించారు. వెంటనే ఇంపాక్ట్ స్పీచ్ ఒకటి గుర్తుకు వచ్చి దాని కోసం వెతకడం ప్రారంభించాను. ఎంతకూ దొరక్కపోవడంతో... ఇంపాక్ట్ స్పీచ్ అవధానం అని టైప్ చేసే సరికి వారి వీడియోనే కంటపడింది. అలా ఆయన మాటలు వింటూ ఇంటికి చేరుకున్నాను. అలా వింటూ ఉండగా చార్జింగ్ అయిపోవడంతో ఆయన మాటలు కూడా ఆగిపోయాయి. సరే అని చెప్పి... ఫోన్ ఛార్జింగ్ పెట్టి నా పనుల్లో నేను మునిగిపోయాను. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

ఇంట్లో శ్రీమతి చేసిన రిక్వెస్ట్‌తో అంట్లు తోమేసి, కాసేపు సిస్టమ్ అలా ఆన్ చేద్దామని తలచి, ఆన్ చేశాను. కొద్దిసేపు అదీ, ఇదీ సెర్చ్ చేశాక.. గూగుల్ ప్రేరణతో సగంలో ఆపేసిన రాళ్లబండి వారి మాటలు పూర్తిగా విన్నాను. ఆ మాటల ప్రవాహం నన్ను గతంలోనూ ముంచెత్తింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఈరోజు కూడా అదే రీతిగా నన్ను తట్టిలేపాయి. అలా అర్ధరాత్రి దాటినా ఆయనే మనసులో ఆలోచనల జడివాన కురిపిస్తున్నారు.

ఆయన్ను నేను తొలిసారి 2009లో చూశాను. పేపర్‌లో అష్టావధానం గురించి చదివిన నేను, అది ఉన్న చోటుకి వెళ్లాను. అక్కడ జనంలో ఓ మూలగా కూర్చుని రాళ్లబండి వారి అవధానం విన్నాను. అదే వారిని నేను తొలిసారి చూడటం. నా జీవితంలో ఓ ముఖ్యమైన మలుపునకు కారణమైన సందర్భం కూడా అదే. ఆ తర్వాత నాలుగైదేళ్లకు ఇంపాక్ట్ వీడియోలో చూడటం. దాన్ని నేను చూడటమేగాక మరికొంతమందికి కూడా పరిచయం చేశాను. అంతగా నాపై వారి మాటలు ప్రభావం చూపాయి. 

ఆ తర్వాత రెండు మూడేళ్లకు వారు కాలం చేశారు. రాళ్లబండి గారు కాలం చేసిన రోజున నాకు చాలా బాధేసింది. ఇప్పటికీ ఆయన మాటలు వింటుంటే, వారి గొంతులోని మాధుర్యం, తెలుగు భాషపై ప్రేమ హృదయాన్ని తడుతున్నట్టే ఉంటాయి. 

మీరూ వినండి. మిమ్మల్ని కూడా ఆయన నిద్రపోనివ్వరూ. మెలకువతో జ్ఞానాన్ని అందుకోమంటారు. సేవలో తరించమంటారు. జైహింద్.. జైతెలుగుతల్లి.. వందేమాతరం.








పున్నమి కౌగిలి

ఒక వర్షం కురిసిన రాత్రి కనులకు నిదుర దూరమైన క్షణం వర్షం వెలిసిన తర్వాత ఆకాశంలో మెరుస్తున్న చుక్కలు పక్కనే తెల్లని కాంతితో సోగ్గాడు చంద్రుడు ...