Monday, May 1, 2023

పున్నమి కౌగిలి






ఒక వర్షం కురిసిన రాత్రి

కనులకు నిదుర దూరమైన క్షణం

వర్షం వెలిసిన తర్వాత

ఆకాశంలో మెరుస్తున్న చుక్కలు

పక్కనే తెల్లని కాంతితో సోగ్గాడు చంద్రుడు


నడిరాతిరి.. ఒంటరిగా పయనం 

పున్నమి కౌగిలికి సిద్ధమవుతున్న ప్రకృతి శోభ

ఓ చక్కని చుక్క

నేలకు దిగొచ్చిందా అన్నట్టుగా 

కళ్లముందొక అందం

చూపులు తిప్పుకోనివ్వని పరువం

ఊపిరి సలపనివ్వని ఆలోచనల సంగమం  


నా వెనకే వస్తూ,

నాతో పాటుగా నడుస్తూ,

నన్ను దాటిపోతూ..

కనిపించీ కనిపించని చూపులతో

వలపుల బాణాలు విసురుతూ

మాయమైపోయింది! 


నేను మాత్రం అక్కడే,

ఆ కాంతామణికి దాసుడినై

విరహగీతాల గాయకుడినై.. 


Saturday, December 24, 2022

Corporate world


 Corporate world ... ఈ పేరు వినగానే గ్రామీణ, అర్బన్ ప్రాంత యువతకు చాలా పెద్ద పదంగా కనపడుతూ ఉంటుంది. English లో మాట్లాడే జనాలు, మెయిల్స్ గోల, colourful జీవితాలు, అర్థం కానీ యవ్వారాలు అనుకుంటూ ఉంటారు. ఆ చాలా మందిలో నేనూ కూడా ఒకడినే. భాష రాకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందులతో మనలో మనం ఆత్మనూన్యతకు గురవుతూ ఉంటాం. ఇప్పటికీ నాకు ఇంగ్లిష్ అంటే మాట్లాడటానికి ఇబ్బందిపడే అంశమే.


అయితే, ఇక్కడితోనే మన భవిష్యత్తు ఆగిపోతుందని అనుకోవద్దు. మీలో నిజంగా ఎదగాలనే తపన, క్రమశిక్షణ, మంచి బుద్ధి, నలుగురిలో కలిసిపోయే తత్వం, సానుకూల దృక్పథంతో ఉంటే ఎదగగలం. అయితే అడుగులు తడబడొచ్చు, మెల్లగా వేయొచ్చు, మందకొడిగా సాగొచ్చు. అంతమాత్రం చేత మనలో ఎదుగుదల ఆగిపోయింది అనుకోవద్దు. అసలు భయపడొద్దు. మీకు వచ్చినదానితో మీరు ఎంత వరకు ప్రతిభావంతంగా పని చేయగలరో ఆలోచించండి. దానికి పదును పెట్టండి. భాష నేర్చుకోవడానికి ప్రయత్నించండి. రాకపోయినా కంగారుపడొద్దు. ఆలస్యం అయినా గమ్యాన్ని చేరుకోవచ్చు. గగనంతో పోటీ పడేలా దూసుకుపోవచ్చు.

చెబుతున్నా కదా... డిజిటల్ ప్రపంచంలో ఉన్నాం మనం. నాలా తెలుగులో మాత్రమే రాయగలిగే వాళ్లు చాలా మందికి అదే గొప్ప అవకాశం. ఆలోచించండి. సోషల్ మీడియాలో, మీరు చూస్తున్న ఓటీటీ ప్రపంచంలో మన మాతృభాషకు పెరుగుతున్న అవకాశాలు. స్థానికతకు పట్టం కడుతోంది ప్రపంచం.

16 కోట్ల మంది తెలుగువారు ఉన్నారని అంటుంటారు. పది కోట్ల మంది ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. మిగిలిన ప్రపంచంలో మిగిలిన వాళ్లు. తరాలు మారుతున్నా తెగిపోనిది ఏదైనా ఉందంటే మట్టితో మనకున్న మమకారమే. ఒక్కసారి గుండె లోతుల్లో ఉన్న ఆ తడిని తాకి చూడండి. మిమ్మల్ని ఎవరు దూరం పెడతారు? స్వార్థంతో కాదు. నిస్వార్థమైన, నిష్కల్మషమైన ఆలోచనతో మీరు నడవడం మొదలుపెట్టండి. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినవారు అవుతారు. నాకు వచ్చిన భాషలో మీకు అర్థమయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించాను. ఇది మన భాష.. మన తెలుగు. మన ఊరి మాట. మన అమ్మ చూపిన బాట.

మిమ్మల్ని, నన్ను నడిపించేది ఆ తెలుగు బంధమే. కార్పొరేట్ దిగ్గజాలు కూడా వాళ్ల మాతృభాషలోనే ఆలోచిస్తారు. ఇంగ్లిష్‌లో ఆచరణలో పెడతారేమో అంతే. ఇక్కడ ఎవరి అవకాశాలను ఎవరూ గద్దల్లా తన్నుకుపోలేరు. మీకు ఆలోచన, వినూత్నమైన దృక్పథం ఉంటే మీకు ప్రపంచమే ఆహ్వానం పలుకుతుంది. నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన అమ్మ భాష సాక్షిగా చెబుతున్న మాటలివి. గెలిచేంత వరకు కాదు, మరో నలుగురికి దారి చూపే వరకు ఈ పయనం సాగుతుంది.

Thursday, December 22, 2022

రాళ్లబండి

 అర్ధరాత్రి అయినా, ఇంకా మెలకువగా ఉండటానికి కారణం స్వర్గీయ శ్రీ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు. అవధానంలో ఆయనకంటూ ప్రత్యేక శైలి ఉంది. భాషాభిమాని, మంచి వక్త, కవి, రచయిత. ఆఫీసు వాళ్లతో క్రికెట్ ఆడి ఇంటికి వస్తున్న సమయంలో ఎందుకో ఆయన నా మనసుకు స్ఫురించారు. వెంటనే ఇంపాక్ట్ స్పీచ్ ఒకటి గుర్తుకు వచ్చి దాని కోసం వెతకడం ప్రారంభించాను. ఎంతకూ దొరక్కపోవడంతో... ఇంపాక్ట్ స్పీచ్ అవధానం అని టైప్ చేసే సరికి వారి వీడియోనే కంటపడింది. అలా ఆయన మాటలు వింటూ ఇంటికి చేరుకున్నాను. అలా వింటూ ఉండగా చార్జింగ్ అయిపోవడంతో ఆయన మాటలు కూడా ఆగిపోయాయి. సరే అని చెప్పి... ఫోన్ ఛార్జింగ్ పెట్టి నా పనుల్లో నేను మునిగిపోయాను. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

ఇంట్లో శ్రీమతి చేసిన రిక్వెస్ట్‌తో అంట్లు తోమేసి, కాసేపు సిస్టమ్ అలా ఆన్ చేద్దామని తలచి, ఆన్ చేశాను. కొద్దిసేపు అదీ, ఇదీ సెర్చ్ చేశాక.. గూగుల్ ప్రేరణతో సగంలో ఆపేసిన రాళ్లబండి వారి మాటలు పూర్తిగా విన్నాను. ఆ మాటల ప్రవాహం నన్ను గతంలోనూ ముంచెత్తింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఈరోజు కూడా అదే రీతిగా నన్ను తట్టిలేపాయి. అలా అర్ధరాత్రి దాటినా ఆయనే మనసులో ఆలోచనల జడివాన కురిపిస్తున్నారు.

ఆయన్ను నేను తొలిసారి 2009లో చూశాను. పేపర్‌లో అష్టావధానం గురించి చదివిన నేను, అది ఉన్న చోటుకి వెళ్లాను. అక్కడ జనంలో ఓ మూలగా కూర్చుని రాళ్లబండి వారి అవధానం విన్నాను. అదే వారిని నేను తొలిసారి చూడటం. నా జీవితంలో ఓ ముఖ్యమైన మలుపునకు కారణమైన సందర్భం కూడా అదే. ఆ తర్వాత నాలుగైదేళ్లకు ఇంపాక్ట్ వీడియోలో చూడటం. దాన్ని నేను చూడటమేగాక మరికొంతమందికి కూడా పరిచయం చేశాను. అంతగా నాపై వారి మాటలు ప్రభావం చూపాయి. 

ఆ తర్వాత రెండు మూడేళ్లకు వారు కాలం చేశారు. రాళ్లబండి గారు కాలం చేసిన రోజున నాకు చాలా బాధేసింది. ఇప్పటికీ ఆయన మాటలు వింటుంటే, వారి గొంతులోని మాధుర్యం, తెలుగు భాషపై ప్రేమ హృదయాన్ని తడుతున్నట్టే ఉంటాయి. 

మీరూ వినండి. మిమ్మల్ని కూడా ఆయన నిద్రపోనివ్వరూ. మెలకువతో జ్ఞానాన్ని అందుకోమంటారు. సేవలో తరించమంటారు. జైహింద్.. జైతెలుగుతల్లి.. వందేమాతరం.








Tuesday, April 21, 2020

History's most notorious dictator

History's most notorious dictator... జాతీయవాదిగా.. జర్మన్లకు ఆరాధ్యనేతగా.. ప్రపంచాన్ని గడగడలాడించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిన వ్యక్తి అడాల్ఫ్ హిట్లర్. ఏప్రిల్ 20 ఆయన పుట్టినరోజు. ఈయన విద్వేషాలు రెచ్చగొట్టినవాడే కావచ్చు. కానీ ఆయన నుంచి మనం నేర్చుకోవలసింది ఒకటి ఉంది. అద్భుతమైన వక్తగా ఆయన ఎదిగినతీరు నిజంగా స్ఫూర్తినిచ్చేదే. అంతేకాదు మంచి చిత్రకారుడు కూడా.. మాటలతో కోటలు కడుతున్న ఈ రోజుల్లో ఆయన జీవితం మనకూ ఓ పాఠమే!

Do not compare yourself to others. If you do so, you are insulting yourself - Hitler

Monday, April 13, 2020

మీ త్యాగం వృథా కాదు..!


జలియన్ వాలాబాగ్ ఉదంతానికి నేటితో సరిగ్గా 101 ఏళ్లు. స్వాతంత్ర్య కాంక్షతో ఓ చోట గుమిగూడిన అమాయక జనంపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు జనరల్ డయ్యర్. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. 1919లో జరిగిన ఈ ఘటన 2019తో వందేళ్లు పూర్తి చేసుకుంది. ఆనాటి అమరవీరుల స్మృత్యర్థం భారత ప్రభుత్వం స్మారక స్తూపం నిర్మించింది. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే. బాలుడిగా ఉన్న భగత్ సింగ్‌లో తీవ్ర స్వాతంత్ర్య కాంక్షను రగిలించింది ఈ ఘటనే. ఆ నాటి అమరవీరులను గుర్తు చేసుకుంటూ వందేమాతరం.. జైహింద్ 

Saturday, April 11, 2020

ఏనుగమ్మ ఏనుగు

ఏనుగంటే ఎందుకో అభిమానం పెరిగింది. గతంలో కంటే ఎక్కువగా వాటి ఫొటోలను మొబైల్‌లో సేవ్ చేసుకోవడమో.. హోమ్ స్క్రీన్ గానో, లాక్ స్క్రీన్ గానో పెట్టుకోవడం అలవాటుగా మారింది. ఏనుగంటే భక్తి భావం కూడా. కలిసి వస్తుందనే నమ్మకం దీని వెనక ఉందనుకోండి. నా కీన్ చెయిన్ కూడా ఆఖరుకి ఏనుగైతేనే బాగుంటుందనిపిస్తుంటుంది. 

లాక్ డౌన్ భోజనాలు

గత కొన్ని రోజులుగా దేశంలో, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. దీన్నిదృష్టిలో పెట్టుకుని మా నవభారత నిర్మాణ సేన అన్న వితరణ కార్యక్రమాన్ని చేపట్టింది. వలస కార్మికులకు ఆహార వసతి కల్పిస్తూ... వాళ్లకు మేమున్నామని భరోసా ఇస్తోంది. దాతలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తూ మాకు తోడ్పాటును అందిస్తున్నారు. వారి నమ్మకాన్ని, అప్యాయతాభిమానాలను కాపాడుకుంటామని హామీ ఇస్తున్నాము. ఇక గత మంగళవారం ఏబీఎన్ ఛానల్ వారు మా కార్యక్రమాన్ని చిత్రీకరించడం.. అలాగే టీన్యూస్‌లో కూడా ప్రసారం కావడం మాకు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ నెల 30వరకు లాక్ డౌన్ ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మా కార్యక్రమాన్ని మరింత దృఢసంకల్పంతో కొనసాగిస్తామని చెబుతున్నాను. అలాగే మరింత బలాన్ని ఇవ్వాల్సిందిగా ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను. కరోనా భూతం పీడ విరగడ అయ్యేలా చెయ్యాలని కోరుతున్నాను. వందేమాతరం..జైహింద్ 

పున్నమి కౌగిలి

ఒక వర్షం కురిసిన రాత్రి కనులకు నిదుర దూరమైన క్షణం వర్షం వెలిసిన తర్వాత ఆకాశంలో మెరుస్తున్న చుక్కలు పక్కనే తెల్లని కాంతితో సోగ్గాడు చంద్రుడు ...